: మహేష్ బాబు కొడుకు, కూతురు ఫ్యూచర్ స్టార్స్: సినీ హీరోయిన్ సమంత
మహేష్ బాబు కొడుకు, కూతురు ఫ్యూచర్ స్టార్స్ అని దక్షిణాది హీరోయిన్ సమంత చెప్పింది. సూర్య హీరోగా ఇటీవల విడుదలైన ‘24’ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొంది. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ, ఈ వేసవిలో వరుసగా పోలీస్, 24, బ్రహ్మోత్సవం, అ..ఆ చిత్రాల్లో నటించానని చెప్పింది. ‘24’ చిత్ర కథను ప్రజలకు అర్థమయ్యేలా దర్శకుడు విక్రమ్ కుమార్ అద్భుతంగా తెరకెక్కించారన్నారు. ఈ సినిమాలో తను నటించిన సన్నివేశాలు ప్రేక్షకులకు మంచి రిలీఫ్ ఇస్తాయన్నారు. ప్రిన్స్ మహేష్ బాబు కూతురు సితార, తాను మంచి ఫ్రెండ్స్ అని, సితార నవ్వు, డ్యాన్స్ చాలా బాగుంటాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. మహేష్ బాబు కొడుకు గౌతమ్, కూతురు సితార లు భవిష్యత్తులో కాబోయే స్టార్లు అని సమంత అభిప్రాయపడింది. కాగా, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘జనతా గ్యారేజ్’ లో కూడా ఆమె నటిస్తోంది.