: విమానాల్లో హైదరాబాద్ కు వచ్చి చోరీలు.. పోలీసుల అదుపులో ఢిల్లీ ముఠా సభ్యులు
ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు విమానాల్లో వచ్చి మరీ, ఇక్కడ ఏటీఎంల చోరీకి ఒక ముఠా పాల్పడుతోంది. తాడ్ బండ్ చౌరస్తాలోని ఏటీఎం కేంద్రం వద్ద చోరీలకు పాల్పడుతున్న ఈ ముఠా సభ్యులను హబీబ్ నగర్ పోలీసులు ఈరోజు పట్టుకున్నారు.అయితే ముఠా సభ్యుడు బిపిన్ పరారు కాగా, మిగిలిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని పశ్చిమ మండల డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఢిల్లీ కేంద్రంగా ఏర్పడ్డ ఒక ముఠా హైదరాబాద్ లో ఏటీఎం సెంటర్లలో చోరీలకు పాల్పడుతోందన్నారు. ఈ గ్యాంగ్ కు ఇక్కడి స్థానికుడు సహకరిస్తున్నట్లు చెప్పారు. స్థానిక నిందితుడు సహా ఈ ముఠాలోని ఐదుగురు సభ్యులను హబీబ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారన్నారు. ఈ ముఠా లో మొత్తం ఆరుగురు సభ్యులుండగా, అందులో ఒక వ్యక్తి పరారీలో ఉన్నట్లు చెప్పారు. న్యూఢిల్లీకి చెందిన బిపిన్, సయ్యద్ అజారుద్దీన్, షేక్ అషద్ అలీ, ఇంతికాబ్ ఆలం, మహ్మద్ షాబాజ్ ఖాన్ లతో పాటు హైదరాబాద్ కు చెందిన మహ్మద్ అబ్దుల్ ఖుద్దూస్ ఒక ముఠాగా ఏర్పడ్డరన్నారు. హైదరాబాద్ సిటీలోని ఐదు బ్యాంకులకు చెందిన ఏటీఎం కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నారన్నారు. సెక్యూరిటీ గార్డులు లేని, ఏటీఎం మిషన్లు రెండు ఉన్న వాటిలోనే వారు చోరీలకు పాల్పడుతున్నారన్నారు. చోరీకి వెళ్లేటప్పుడు ఐదుగురిలో ముగ్గురు బయట కాపలా కాస్తారని, ఇద్దరు వ్యక్తులు లోపలికి వెళతారని చెప్పారు. రెండు పద్ధతుల్లో వారు చోరీలు చేస్తారని, మొదటి పద్ధతిలో...రెండు ఏటీఎంలలో ఒక దానిని పనిచేయకుండా చేసేందుకు చిప్ మాదిరిగా ఉండే ఒక ప్లాస్టిక్ ముక్కను వినియోగిస్తారన్నారు. ఆ ఏటీఎంలో డబ్బు తీసుకునేందుకు వచ్చిన వినియోగదారుడు అందులో తన కార్డు పెట్టి తీసేసాదాకా వాళ్లు వేచి చూస్తారని చెప్పారు. ఆ తర్వాత ఆ మిషన్ పనిచేయడం లేదని వారికి చెప్పి, రెండో ఏటీఎంలో డబ్బు డ్రా చేసుకోవాల్సిందిగా చెబుతారని, ఆ సమయంలో వినియోగదారుడి పిన్ నంబర్ ను తెలుసుకుని నిందితులు తమకు కావాల్సిన డబ్బును డ్రా చేసుకుంటారని చెప్పారు. ఇక, రెండో పద్ధతిలో... నిరక్షరాస్యులను, వృద్ధులను, ఏటీఎం వినియోగం సరిగా తెలియనివాళ్లను ఎంచుకుని చోరీలకు పాల్పడుతుంటారని డీసీపీ వెంకటేశ్వరరావు వివరించారు. నిందితుల నుంచి రూ.1.5 లక్షల నగదు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.