: ఇది మోదీకి గట్టి ఎదురుదెబ్బ: కేజ్రీవాల్
ఉత్తరాఖండ్ లో ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచన ఫలించలేదని, అక్కడ ప్రజాస్వామ్యమే గెలిచిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. బలపరీక్ష ముగిసిన తరువాత మోదీపై ఎదురుదాడికి దిగుతూ, ఈ ఫలితం మోదీకి గట్టి ఎదురుదెబ్బని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా కేంద్రంలోని అధికారాన్ని వినియోగించుకుని రాష్ట్రాల్లోని బీజేపీయేతర ప్రభుత్వాలను పడగొట్టాలని చూడటం ఆపాలని కోరారు. ఇకనైనా కేంద్రం ఆ ఆలోచన వదిలేస్తుందని భావిస్తున్నట్టు తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. కాగా, ఉత్తరాఖండ్ లో బలపరీక్ష పూర్తికాగా, ఫలితాలు రేపు సుప్రీంకోర్టుకు సీఎస్ అందించనున్న సంగతి తెలిసిందే. ఈ ఫలితం హరీశ్ రావత్ కు అనుకూలంగా వచ్చినట్టు అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ వర్గాలు స్పష్టం చేశాయి.