: ఛత్తీస్గఢ్లో చిన్నారుల సమస్యల పరిష్కారానికి ‘చైల్డ్ ఫ్రెండ్లీ’ ప్రత్యేక పోలీస్ స్టేషన్లు
చిన్నారులు తమపై జరుగుతోన్న అకృత్యాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావడానికి ఛత్తీస్గఢ్లో ‘చైల్డ్ ఫ్రెండ్లీ’ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఛత్తీస్గఢ్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎస్సీపీసీఆర్) ప్రభుత్వానికి సూచించింది. చిన్నారులు సమాజం నుంచి ఎదుర్కుంటోన్న సమస్యలను నివారించడానికి, చిన్నారులకు ఆపదనుంచి రక్షణకల్పించే మిత్రుల్లా ‘చైల్డ్ ఫ్రెండ్లీ’ పోలీస్ స్టేషన్లు ఉపయోగపడతాయని చెప్పింది. ఈ మేరకు ఎస్సీపీసీఆర్ అక్కడి ప్రతీ జిల్లాలో కనీసం ఐదు చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని కోరింది. ‘చైల్డ్ ఫ్రెండ్లీ’ పోలీస్ స్టేషన్ గోడలను పిల్లలకు ఇష్టమైన పెయింటింగ్ ను వేయాలని ఎస్సీపీసీఆర్ సూచించింది. పోలీస్ స్టేషన్లో పలు రకాల బొమ్మలను కూడా ఉంచాలని చెప్పింది. దీనిపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కూడా స్పందించి ఈ తరహా పోలీస్ స్టేషన్లు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తే మంచి ప్రయోజనం ఉంటుందని సూచించింది. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సూచనల మేరకు ‘చైల్డ్ ఫ్రెండ్లీ’ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. పిల్లలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయని, బాలల హక్కులను ఉల్లంఘిస్తూ వారిని వేధింపులకు గురి చేస్తున్నారని ఎస్సీపీసీఆర్ మీడియాకు తెలిపింది. చిన్నారులపై జరుగుతోన్న లైంగిక వేధింపుల పట్ల తక్షణమే స్పందించి, వాటిని నివారించాలంటే ‘చైల్డ్ ఫ్రెండ్లీ’ పోలీస్ స్టేషన్లు నిర్వహించాలని చెప్పింది. ఛత్తీస్గఢ్ లోని రాయ్పూర్, దర్గ్, బిలాస్పూర్ లో చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు కాబోతున్న మొట్టమొదటి రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ నిలవనుందని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అధికారులు తెలిపారు.