: కాంగ్రెస్‌ది పూటకో మాట.. రాష్ట్రానికో విధానం, ఆర్డీఎస్‌పై ఆ నేతలది దొంగ దీక్ష: హరీశ్ రావు
కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరు ఒక్కోలాగా మాట్లాడుతున్నారని తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. అంతేగాక ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా మాట్లాడుతున్నారని అన్నారు. ఈరోజు హైదరాబాద్ లో మీడియాతో హరీశ్ రావు మాట్లాడుతూ... ఆర్డీఎస్‌పై కాంగ్రెస్ నేతలు దొంగ దీక్షకు దిగుతున్నారంటూ విమర్శించారు. మేడిగడ్డపై మహారాష్ట్ర కాంగ్రెస్ ది తప్పుడు ప్రచారమని ఆయన అన్నారు. ‘కాంగ్రెస్‌ది పూటకో మాట, రాష్ట్రానికో విధాన’మని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ది మాత్రం ఎప్పటికీ ఒకే మాట అని ఉద్ఘాటించారు. ఆర్డీఎస్‌లో వాటా కోసం టీఆర్‌ఎస్ హేతుబద్ధంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో కర్ణాటకతో సాగునీటి ప్రాజెక్టులపై ఒక్కసారైనా మాట్లాడారా..? అని ఆయన ప్రశ్నించారు. ఆర్డీఎస్‌పై రాజకీయం తగదని హితవు పలికారు. ఆర్డీఎస్ పేరుతో కాంగ్రెస్ ఆడేవన్నీ నాటకాలేనని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు తెలంగాణ ప్రాజెక్టులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలే వారికి బుద్ధి చెబుతారని అన్నారు.