: ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లకు మధ్య సీక్రెట్ ఫ్లోర్... పోలీసులకే షాకిచ్చిన హైటెక్ సెక్స్ రాకెట్!
బెంగళూరులో నిత్యమూ బిజీగా ఉండే ప్రాంతమది. క్రైమ్ బ్రాంచ్ హెడ్ క్వార్టర్స్ కు దగ్గర్లోనే ఉండే శివ ప్యాలెస్ డీలక్స్ లాడ్జ్. అక్కడ పక్క రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తెప్పించి వ్యభిచారం నడుపుతున్నారన్నది రెండేళ్ల నుంచి వస్తున్న ఆరోపణ. బెంగళూరు పోలీసులు ఒకటి, రెండు సార్లు కాదు. ఏకంగా ఆరు సార్లు ఆ హోటల్ పై దాడి చేసి అణువణువూ గాలించినా, వ్యభిచారానికి సంబంధించిన ఒక్క ఆధారమూ దొరకలేదు. మళ్లీ అదే హోటల్ పై ఆరోపణలు వినిపిస్తూనే ఉండటంతో, ఏడోసారి తనిఖీలకు వెళ్లిన వారు, కేసును ఛేదించగలిగారు. అక్కడ జరుగుతున్న హైటెక్ సెక్స్ రాకెట్ ను చూసి షాకయ్యారు. తనిఖీలకు వెళ్లిన ఇన్ స్పెక్టర్ కు ఎందుకో అనుమానం వచ్చింది. ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లకు మధ్య ఎత్తు చాలా ఎక్కువగా ఉన్నట్టు కనిపించింది. ఈ రెండు ఫ్లోర్లకూ మధ్య ఏదో ఉందన్న అనుమానంతో తనిఖీలు చేయగా, ఓ సీక్రెట్ డోర్ బయటపడిందట. దాన్ని తెరచి చూస్తే, అక్కడ తక్కువ ఎత్తులో ఉన్న ఫ్లోర్, కొన్ని గదులు, అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు దారి ఉన్నాయి. హోటల్ యజమాని తెలివికి అవాక్కయిన పోలీసులు, బీహార్, బెంగాల్ అమ్మాయిలతో పాటు, సెక్స్ రాకెట్ నిర్వాహకులనూ అరెస్ట్ చేశారు. హోటల్ కు వెళ్లిన వారికి అక్కడ ఒక ఫ్లోర్ ఉందన్న అనుమానమే కలగని విధంగా దీన్ని డిజైన్ చేశారట. పోలీసులు దాడులకు వెళితే, నిర్వాహకులు నొక్కే కాలింగ్ బెల్ ఆ ఫ్లోర్ లోని వారిని అలర్ట్ చేస్తుందని, దీంతో వారు మరో ద్వారం గుండా బయటకు వెళ్లి పోయేవారని పోలీసులు తెలిపారు. ఇప్పుడిక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.