: హరీశ్ రావత్ కు షాక్... కాంగ్రెస్ శిబిరం నుంచి ఎమ్మెల్యే జంప్!
ఉత్తరాఖండ్ రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. మరికొన్ని గంటల్లో అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోనున్న కాంగ్రెస్ సీఎం హరీశ్ రావత్ కు షాకిస్తూ, ఓ ఎమ్మెల్యే మాయమయ్యారు. పార్టీ తరఫున 27 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వారందరినీ బీజేపీ నుంచి కాపాడుకునేందుకు అసెంబ్లీకి గంట ప్రయాణ దూరంలో ఉన్న ముస్సోరీలోని ఓ రిసార్టులో వీరిని దాచాలని భావించి అందరినీ తరలించారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యే రేఖా అర్యా మాత్రం ఫోన్ కు అందుబాటులో లేరని తెలుస్తోంది. ఆమె ఏమైంది? ఎక్కడికి వెళ్లిందన్న సమాచారం తెలుసుకునేందుకు కాంగ్రెస్ నేతలు హడావుడి పడుతున్నారు. తాను ఆర్యా కుటుంబంతో మాట్లాడామని, ఆమె అసెంబ్లీకి వచ్చి హరీశ్ రావత్ కు అనుకూలంగా ఓటేసేలా ఒప్పించామని రాష్ట్ర కాంగ్రెస్ నేత శిల్పి అరోరా వెల్లడించడం మినహా ఆమె జాడ తెలియక పోవడంతో కాంగ్రెస్ శిబిరంలో ఆందోళన నెలకొంది. కాంగ్రెస్ వారిని మాత్రమే నమ్ముకోరాదన్న ఆలోచనలో ఉన్న రావత్, ఇద్దరు బీఎస్పీ, ముగ్గురు స్వతంత్ర సభ్యులతో పాటు ఉత్తరాఖండ్ కాంతి దళ్ కు చెందిన ఓ ఎమ్మెల్యేను తనకు మద్దతిచ్చేందుకు ఒప్పించారని తెలుస్తోంది. ఇక హరీశ్ భవితవ్యం ఈ మధ్యాహ్నంలోగా తేలనుంది.