: స్నేక్ గ్యాంగ్ కు ఏ శిక్ష పడుతుంది?... 37 మంది యువతులపై దాష్టీకం కేసులో కోర్టు తీర్పు నేడే!
నిర్జన ప్రదేశాల్లో ఊసులాడుకునే యువ జంటలే లక్ష్యంగా హైదరాబాదు పాతబస్తీకి చెందిన స్నేక్ గ్యాంగ్ లెక్కలేనన్ని దురాగతాలకు పాల్పడింది. పాములను చేతిలో పట్టుకుని రంగంలోకి దిగే స్నేక్ గ్యాంగ్ సభ్యులు జంటలోని యువకుడిపై దాడి చేయడంతో పాటు బాధితుడి కళ్లెదుటే అతడి ప్రేయసిపై సామూహిక అత్యాచారాలు చేసిన వైనం ఏడాదిన్నర క్రితం పెను సంచలనం రేపింది. లెక్కలేనంత మందిపై ఈ తరహా దాడులకు దిగిన 9 మంది సభ్యుల స్నేక్ గ్యాంగ్ పై 2014లోనే ఓ యువతి ధైర్యం చేసి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముఠాలోని 9 మంది సభ్యులను అరెస్ట్ చేశారు. తమకు అందిన సమాచారం మేరకు స్నేక్ గ్యాంగ్ 37 మంది యువతులపై దురాగతానికి పాల్పడినట్లు పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ప్రస్తుతం నిందితులు చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ కేసులో పోలీసులు సమర్పించిన సాక్ష్యాలు, బాధితుల వాదనలను విన్న రంగారెడ్డి జిల్లా కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. సంచలనం రేపిన ఈ కేసులో తీర్పు నేపథ్యంలో కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్నేక్ గ్యాంగ్ కు ఏ తరహా శిక్ష పడుతుందన్న విషయంపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది.