: మొదటి ర్యాంకు వస్తుందని ఊహించలేదు: ఏపీ 'ఎంసెట్' టాప్ ర్యాంకర్ వంశీ కృష్ణారెడ్డి
తల్లిదండ్రులకు, గురువులకు మొదట తన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని ఏపీ ఎంసెట్.. ఇంజనీరింగ్ విభాగంలో మొదటి ర్యాంకు సాధించిన వంశీ కృష్ణారెడ్డి చెప్పాడు. ఈ సందర్భంగా అతను ఒక టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ, మొదటి ర్యాంకు వస్తుందని తాను ఊహించలేదని, తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పాడు. ఇంజనీరింగ్ పై తనకు చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉందని చెప్పాడు. టెక్నాలజీపైన తాను మొదటి నుంచి ఆసక్తి చూపించేవాడినని, క్రమంగా ఇంజనీరింగ్ పై ఆసక్తి పెరిగిందని చెప్పాడు. తాను ఫస్ట్ ర్యాంకు సాధించినప్పటికీ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ కు వెళ్లకపోవచ్చని, ఐఐటీపై తన దృష్టి ఉందని, కంప్యూటర్ సైన్స్ అంటే తనకు ఇష్టమని చెప్పాడు. తన నాలెడ్జిని దేశం కోసం ఉపయోగించాలన్నదే తన కోరికని వంశీ కృష్ణా రెడ్డి తెలిపాడు.