: నీట్ తప్పని సరి: స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఎదురుదెబ్బ తగిలింది. వైద్యవిద్యనభ్యసించాలంటే నీట్ పరీక్ష రాయక తప్పదని స్పష్టం చేసింది. నీట్ నిబంధనల ప్రకారం రాష్ట్రాల చట్టాలు చెల్లవని తెలిపింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కు మాత్రమే నీట్ వర్తిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. మైనారిటీ కాలేజీల హక్కులకు నీట్ కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని సుప్రీం స్పష్టం చేసింది. నీట్ వైద్యవిద్య ప్రవేశ పరీక్ష మాత్రమేనని, దీని ద్వారా కళాశాలల్లో సీట్ల భర్తీ మాత్రమే జరుగుతుందని తెలిపింది. దీని వల్ల రాష్ట్రాలకు, రిజర్వేషన్లకు ఎలాంటి నష్టం వాటిల్లదని సుప్రీంకోర్టు వెల్లడించింది. రాష్ట్రాలకు ఎంట్రన్స్ లు నిర్వహించే హక్కు లేదని తెలిపింది. సీబీఎస్ఈ, ఎంసీఐ అవసరమైతే పరీక్ష నిర్వహణ తేదీ మార్చుకోవచ్చని సుప్రీం పేర్కొంది. తెలుగు మీడియం విద్యార్థులు తెలుగు మీడియంలో పరీక్షలు రాసేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలిపింది. తాజా తీర్పుతో ఇకపై మెడికల్ ప్రవేశాలకు ఎంసెట్ నిర్వహణ ఉండే అవకాశం లేదు.