: సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించిన పోరాట యోధుడు చెన్నమనేని!
నైజాం, బ్రిటిష్ పాలనతో పాటు, సమైక్యాంధ్ర, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల పాలనను స్వయంగా చూసిన రాజకీయ దిగ్గజం చెన్నమనేని రాజేశ్వరరావు (93) ప్రస్థానం చారిత్రాత్మకమైనది. ఆరు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన చెన్నమనేని తెలంగాణ రాజకీయ కురువృద్ధుడు. 1923 ఆగస్టు 31న శ్రీనివాసరావు, చంద్రమ్మ దంపతుల పన్నెండు మంది సంతానంలో నలుగురు మగవాళ్లలో ప్రథముడుగా జన్మించారు. బీఎస్సీ, ఎల్ఎల్బీ చదవిన చెన్నమనేని 1964-67 మధ్య కరీనగర్ లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. స్వాతంత్ర్య సమరయోధులు ఇచ్చిన స్పూర్తితో 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. అనంతరం 1947-51 మధ్య భూమికోసం, భుక్తి కోసం అంటూ తెలంగాణ విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన పాలుపంచుకున్నారు. అందులో క్రియాశీలకంగా వ్యవహరించడంతో నిఘా ఎక్కువైంది. దీంతో ఆయన కొంత కాలం అజ్ఞాత జీవితం గడపాల్సి వచ్చింది. బ్రిటీషు, నిజాం పాలనతో పాటు, సమైక్యాంధ్ర, తెలంగాణ పాలకుల పనితనాన్ని ఆయన చూడగలిగారు. 1957లో తొలిసారి పీడీఎఫ్ శాసనసభ్యుడిగా కరీంనగర్ జిల్లా చొప్పదండి నుంచి ప్రాతినిధ్యం వహించిన రాజేశ్వరరావు 60 ఏళ్లు రాజకీయాల్లో కొనసాగారు. సీపీఐ పార్టీ తరపున సిరిసిల్ల నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎంపీగా సీపీఐ తరపున రెండు సార్లు పోటీ చేసినా, విజయం సాధించలేదు. 1952-57 మధ్య సీపీఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా పని చేసిన ఆయన, రెండు దశాబ్దాల పాటు సీపీఐ కార్యనిర్వాహక సభ్యుడిగా పని చేశారు. దశాబ్దం పాటు సెక్రటేరియట్ సభ్యుడిగా, ఐదుసార్లు సీపీఐ నేషనల్ కౌన్సిల్ సభ్యుడిగా, మూడుసార్లు సీపీఐ సెంట్రల్ కంట్రోల్ కమిషన్ సభ్యుడిగా పని చేశారు. కమ్యూనిజంపై ఆసక్తితో ఆయన రష్యా, తూర్పు జర్మనీ, సింగపూర్, మలేషియాల్లో పర్యటించారు. ఎమ్మెల్యే పదవి ఉన్నా లేకున్నా రైతు సంఘాల నేతగా ఆయన ఎన్నికయ్యేవారు. 1969లో ఏర్పాటైన బీసీ కమిషన్ లో కూడా ఆయన ఉన్నారు. 1999 ఆగస్టు 9న సీపీఐకి రాజీనామా చేసి, అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. 1999లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమిపాలైనప్పటికీ 2004లో గెలిచి, టీడీపీ శాసనసభాపక్ష ఉపనేతగా సేవలందించారు. రాజకీయ నేతగా, ఎమ్మెల్యేగా పలు సేవాకార్యక్రమాలు చేపట్టారు. చరమాంకంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, ఆ తర్వాత క్రియాశీలక రాజకీయాలకు తనంత తానుగా ఆయన దూరమయ్యారు. ఆయన సోదరుడు సీహెచ్ విద్యాసాగరరావు మహారాష్ట్ర గవర్నర్ గా కొనసాగుతుండగా, ఆయన కుమారుడు రమేష్ బాబు వేములవాడ ఎమ్మెెల్యేగా కొనసాగుతున్నారు.