: దళితుల్లో బుద్ధిజం పట్ల ఆసక్తి పెరిగిపోతోంది... గణాంకాల వెల్లడి!


దళితులు క్రైస్తవం పట్ల ఆకర్షితులవుతున్నారని గతంలో గణాంకాలు వెల్లడించాయి. అందుకనుగుణంగానే మతమార్పిళ్ల అంశం కలకలం రేపింది. అయితే హిందూమతాన్ని వ్యతిరేకించడానికి, ఏ కుల వ్యవస్థ అయితే కారణమైందో అదే కుల వ్యవస్థ క్రైస్తవంలోనూ పెరిగిపోతుండడంతో దాని పట్ల కూడా దళితులు ఆసక్తి కోల్పోతున్నారని ఆ మత అంతర్గత సర్వేలు చెబుతున్నాయి. ఇదే సమయంలో దళితులు బుద్ధిజం పట్ల ఆసక్తి పెంచుకుంటున్నారని గణాకాలు చెబుతున్నాయి. దేశంలో దళిత ఉద్యమం విజయవంతం కావడంలో బుద్ధిజం కూడా విశేషమైన పాత్ర పోషిస్తోందని లెక్కలు బయటపెడుతున్నాయి. 2001లో బుద్ధిస్టు ఎస్సీలు 41.59 లక్షల మంది ఉండగా, 2011 నాటికి ఆ జనాభా 57.56 లక్షలకు పెరిగిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అంటే గతంలో కంటే 38 శాతం బుద్ధిస్టులు పెరిగారని గణాంకాలు చెబుతున్నాయి. 2001 నాటికి దేశంలో ఎస్సీల జనాభా 16.6 కోట్లు ఉండగా, 2011 నాటికి ఇది 21.3 శాతం పెరిగి 20.14 కోట్లకు చేరింది. బౌద్ధమతంలో ఉన్న ఎస్సీల్లో 90 శాతం మంది మహారాష్ట్రలోనే ఉన్నారని ఈ గణాంకాలు వెల్లడించాయి. ఆ రాష్ట్రంలో 52.04 లక్షల మంది బుద్ధిస్టులు ఉన్నారని కేంద్రం తెలిపింది. 2001 నుంచి 2011 నాటికి హిందూ మతంలో దళితుల పెరుగుదల 19.6 శాతం పెరిగి, 15.8 కోట్ల మంది నుంచి 18.9 కోట్లకు చేరింది. అదే సమయంలో దళిత జనాభాలో బుద్ధిస్టుల జనాభా కేవలం 2.83 శాతం మాత్రమే ఉందని కేంద్రం తెలిపింది.

  • Loading...

More Telugu News