: వైసీపీ తెలంగాణ అధ్యక్షుడిగా గట్టు శ్రీకాంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ
తెలంగాణలో వైసీపీ దుకాణం దాదాపుగా మూతపడిపోయింది. ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్న ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవలే వైసీపీని వీడి టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఇక ఆ పార్టీకి ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో అప్పటికే ఇద్దరు గులాబీ గూటికి చేరగా, మిగిలిన పాయం వెంకటేశ్వర్లు కూడా మొన్న పొంగులేటి వెంట జెండా మార్చేశారు. దీంతో తెలంగాణలో వైసీపీ దాదాపుగా ఖాళీ అయ్యింది. అయితే తెలంగాణలో తమ పార్టీ ఇంకా ఉనికిలోనే ఉందని పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నారు. చెప్పడమే కాదండోయ్... పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఆయన గట్టు శ్రీకాంత్ రెడ్డిని ఎంపిక చేశారు. పార్టీ అధినేత ఆదేశాల మేరకు నేటి ఉదయం శ్రీకాంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు కూడా చేపట్టారు. శ్రీకాంత్ రెడ్డితో పాటు కొత్తగా నియమించిన నూతన కమిటీలో ప్రధాన కార్యదర్శులుగా ఎడ్మ కిష్టారెడ్డి, శివకుమార్, అధికార ప్రతినిధిగా కొండా రాఘవరెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నల్లా సూర్య ప్రకాశ్, హెచ్ఏ రెహ్మాన్ కూడా బాధ్యతలు స్వీకరించారు.