: మరో కింగ్ ఫిషర్ లా అలోక్ ఇండస్ట్రీస్... రూ. 20 వేల కోట్ల రుణం వసూలెలాగని తలపట్టుకుంటున్న ఎస్బీఐ


గత సంవత్సరం డిసెంబర్ నెలలో, అలోక్ ఇండస్ట్రీస్ కు ఆడిటర్ గా సేవలందించలేమని చెబుతూ డెల్లాయిట్ సంస్థ తప్పుకుంది. సాధారణంగా కంపెనీల్లో ఆడిటర్లను మార్చడం, ఆ సమాచారాన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలతో పంచుకోవడం సహజమే అయినా, అలోక్ ఇండస్ట్రీస్ నుంచి డెల్లాయిట్ తప్పుకోవడం మార్కెట్ వర్గాలను కుదిపేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం నుంచి రూ. 20 వేల కోట్లను అలోక్ ఇండస్ట్రీస్ రుణంగా తీసుకోవడం, అవి తిరిగి చెల్లించడంలో విఫలం కావడం, ఇప్పుడు ఆడిటర్ గా ఉన్న సంస్థ తప్పుకోవడంతో సంస్థ మరో కింగ్ ఫిషర్ లా మారిందని నిపుణులు వ్యాఖ్యానించారు. డెల్లాయిట్ తప్పుకున్న నాలుగైదు నెలల తరువాత, బ్యాంకులు రంగంలోకి దిగి, తమ నుంచి తీసుకున్న రుణాలను ఎలా వెచ్చించారన్న విషయాన్ని తేల్చే పనిలో తలమునకలై ఉన్నాయి. అలోక్ ఇండస్ట్రీస్ దస్త్రాలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేసే బాధ్యతను చోక్సీ అండ్ చోక్సీ, గ్రాంట్ థ్రాంటన్ ఆడిటింగ్ సంస్థలకు అప్పగించింది. నిధులు ఎలా బయటకు వెళ్లాయి? నిబంధనలను ఎక్కడైనా మీరారా? దాని వెనుక ప్రమోటర్ల హస్తం ఏమైనా ఉందా? అన్న కోణంలో విచారణను ఎస్బీఐ కన్సార్టియం ప్రారంభించింది. కాగా, తామెందుకు అలోక్ ఇండస్ట్రీస్ ఆడిటర్ బాధ్యతల నుంచి తప్పుకున్నామన్న విషయమై వివరణ ఇచ్చేందుకు డెల్లాయిట్ అధికారులు నిరాకరించారు. క్లయింట్ కు చెందిన రహస్యాల గురించి తాము బహిరంగ ప్రకటన చేయలేమని తెలుపగా, డెల్లాయిట్ రాజీనామా సహజసిద్ధంగా జరిగిందేనని అలోక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేంద్ర జివ్రాజికా వెల్లడించడం గమనార్హం. ఇక ఇప్పుడు సంస్థ నుంచి రూ. 20 వేల కోట్లను తిరిగి వసూలు చేయడం ఎలాగని బ్యాంకులు మథనపడుతున్నాయి. బ్యాంకుల ఫోరెన్సిక్ ఆడిట్ కు తాము సహకరిస్తామని డెల్లాయిట్ చెబుతున్నప్పటికీ, ఈ భారీ రుణాన్ని తిరిగి వసూలు చేసుకోవడం అంత సులభమేమీ కాదని నిపుణులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News