: వైసీపీలోకీ చేరికలు షురూ!... వైఎస్ జగన్ పంచన చేరిన కోడుమూరు మాజీ ఎమ్మెల్యే!


ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఏపీలో రాజకీయ సమీకరణల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ‘తలచుకుంటే రోజుల వ్యవధిలో చంద్రబాబు సర్కారును కూలగొడతా’’ అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన సింగిల్ ప్రకటన... రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసింది. జగన్ పార్టీ టికెట్ పై ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో ఇప్పటికే 17 మంది అధికార టీడీపీలో చేరిపోయారు. రోజుల తరబడి సాగుతున్న ఈ జంపింగ్ లతో వైసీపీ కుదేలవగా, టీడీపీ బలం అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా వైసీపీలోకి కూడా చేరికలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ యువ నేత, కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ నిన్న లోటస్ పాండ్ కు వచ్చి వైసీపీ కండువా కప్పుకున్నారు. 2009లో కోడుమూరు (ఎస్సీ రిజర్వ్ డ్) నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మురళీకృష్ణ... ప్రస్తుతం అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే మణిగాంధీపై విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సతీమణి సుజాతమ్మకు నమ్మినబంటుగా పేరుపడ్డ మురళీకృష్ణ... మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కోట్ల కుటుంబంతో కలిసి కొనసాగితే ప్రయోజనం లేదన్న నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలోనే నిన్న హైదరాబాదు వచ్చిన ఆయన నేరుగా లోటస్ పాండ్ లోని వైసీపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కడప జిల్లా కమలాపురం ఎమ్యేల్యే రవీంద్రనాథ్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, మాజీ ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి తదితరులు వెంట రాగా, వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరిపోయారు. ఇప్పటికే వరుస పెట్టి పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్న ప్రస్తుత తరుణంలో పార్టీలో చేరతానంటూ వచ్చిన మాజీ ఎమ్మెల్యేకు స్వయంగా స్వాగతం పలికిన వైఎస్ జగన్... మురళీకృష్ణ కు పార్టీ కండువా కప్పారు.

  • Loading...

More Telugu News