: ఏపీకి ‘హోదా’కు ఆ ముగ్గురు సీఎంలే అడ్డంకి!: కేంద్ర మంత్రి అశోక గజపతిరాజు


రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్న డిమాండ్లు నానాటికి పెరిగిపోతున్నాయి. నిన్నటిదాకా విపక్షాల నుంచే ఈ తరహా డిమాండ్లు వినిపించగా, తాజాగా కేంద్ర మంత్రుల వరుస ప్రకటనలతో అధికార పార్టీ టీడీపీ సైతం గొంతెత్తక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు... అసలు ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు రావడం లేదన్న విషయాన్ని వెల్లడిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని మూడు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రుల వల్లే ఏపీకి ప్రత్యేక హోదా రావడం లేదని ఆయన నిన్న తన సొంతూరు విజయనగరంలో చెప్పారు. తమిళనాడు, కర్ణాటక, బీహార్ ముఖ్యమంత్రులు జయలలిత, సిద్దరామయ్య, నితీశ్ కుమార్ ల వల్లే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని గజపతిరాజు వ్యాఖ్యానించారు. కేవలం ఈ ముగ్గురి వల్లే ఏపీకి అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో చట్టంలో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చి ఉంటే, ఎంతమంది అడ్డుకున్నా ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేదని ఆయన అభిప్రాయపడ్డారు. మోదీ సర్కారు ఏపీని అన్ని విధాలుగా ఆదుకుంటోందని గజపతిరాజు పేర్కొన్నారు. ఏపీకి న్యాయం చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటు సాక్షిగా భరోసా ఇచ్చారన్నారు. ఈ విషయంపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, టీడీపీ ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు కేంద్రంతో మాట్లాడుతూనే ఉన్నారని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News