: సీనియర్ పొలిటీషియన్ చెన్నమనేని ఇక లేరు!
ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న సీనియర్ రాజకీయవేత్త, సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావు(93) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజేశ్వరరావు నేటి తెల్లవారుజామున 3 గంటల సమయంలో మృతి చెందారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాలుపంచుకున్న చెన్నమనేని... వామపక్ష పార్టీ సీపీఐ తరఫున ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగిడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో చేరిన చెన్నమనేని... 2004 ఎన్నికల్లోనూ అక్కడినుంచే విజయం సాధించారు. వయోభారం, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యక్ష రాజకీయాల్లో నుంచి తప్పుకున్న ఆయన తన కుమారుడు చెన్నమనేని రమేశ్ ను రంగంలోకి దింపారు. 2009 ఎన్నికల్లో తన కుమారుడిని కూడా ఆయన అసెంబ్లీకి గెలిపించుకున్నారు. జిల్లాలో వేములవాడ మండలం మారుపాకకు చెందిన చెన్నమనేని రాజేశ్వరరావు... మహారాష్ట్ర గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్ రావుకు స్వయానా సోదరుడు.