: దేవీరెడ్డి మృతిపై వీడిన మిస్టరీ... ప్రమాదంలోనే ఆమె మృతి చెందింది!: సీపీ మహేందర్ రెడ్డి


హైదరాబాద్ లో ఇటీవల కారు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థిని దేవీరెడ్డి మృతి చెందడంపై మిస్టరీ వీడింది. ఆమె కారు ప్రమాదంలోనే మరణించిందని సీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు హైదరాబాదులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో విచారించాకే ప్రమాదమని తేల్చామని చెప్పారు. అనుమానితుల కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించామన్నారు. సంఘటన జరిగిన రోజు దేవి, భరత్ సింహారెడ్డి హాజరైన పార్టీకి వచ్చిన వారందరి కాల్ డేటాన్ విశ్లేషించామన్నారు. ఆరోజు పార్టీకి ఎవరెవరు వెళ్లారో, ఏం జరిగిందో అంతా పరిశీలించామని చెప్పారు. దేవీ శరీరంపై ఉన్న గాయాలు రోడ్డు ప్రమాదంలో ఏర్పడినవేనన్నారు. ఈ విషయమై మెడికల్, ఫోరెన్సిక్, సైంటిఫిక్ నిపుణులను సంప్రదించామన్నారు. కాగా, పబ్ లో పార్టీకి వారం ముందు నుంచే భరత్ సింహారెడ్డి ప్లాన్ చేశాడని, ఆ పార్టీకి వస్తావా? అని అప్పుడే దేవిని అడిగాడని చెప్పారు. మరో స్నేహితురాలు సోనాలి కూడా ఆ పార్టీకి వస్తానని చెప్పడంతో దేవి కూడా ఆ పార్టీకి వెళ్లేందుకు అంగీకరించిందన్నారు. ఇక భరత్ సింహారెడ్డి మద్యం తాగి కారును అతివేగంగా డ్రైవ్ చేసిన కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని, అతనిపై కేసు నమోదు చేయాలని నిర్ణయించామని చెప్పారు. కేసు విచారణలో ఉందని చార్జీషీట్ దాఖలయ్యే వరకు విచారణ జరుపుతామని సీపీ మహేందర్ రెడ్డి వివరించారు.

  • Loading...

More Telugu News