: గ్రామానికి సేవ చేసే అవకాశం రావడం గొప్ప అదృష్టం!: మహేష్ బాబు


బుర్రిపాలెం రావడం తనకు చాలా ఆనందంగా ఉందని సినీ నటుడు మహేష్ బాబు అన్నారు. దత్తత గ్రామం బుర్రిపాలెం చేరుకున్న కొద్ది సేపటి తర్వాత మహేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజకుమారుడు చిత్రం సమయంలో ఈ గ్రామానికి వచ్చానని, మళ్లీ, ఇప్పుడు తన గ్రామానికి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తన నాయనమ్మ, నాన్న, బాబాయిలకు ఈ ఊరంటే చాలా ఇష్టమని, ఊరి కోసం వారు చాలా చేశారని, అదే పద్ధతిలో తాను వెళుతున్నానని అన్నారు. గ్రామానికి సేవ చేసే అవకాశం రావడం తనకు దొరికిన గొప్ప అదృష్టమన్నారు. శ్రీమంతుడు చిత్రం చేసేటప్పుడు తన బావ గల్లా జయదేవ్ ఈ గ్రామాన్ని తనను దత్తత తీసుకోమని చెప్పారన్నారు. తాను చేస్తున్న చిత్రం కూడా ‘దత్తత గ్రామం’ అనే అంశంతో ఉండటంతో, అదే సమయంలో బుర్రిపాలెంను దత్తత తీసుకుంటే కనుక పబ్లిసిటీ కోసమని అందరూ అనుకుంటారని,ఈ చిత్రం విడుదలైన తర్వాత దత్తత తీసుకుంటానని చెప్పానని అన్నారు. గల్లా జయదేవ్ తాను దత్తత తీసుకున్న గ్రామాన్ని ఏ విధంగా అయితే డెవలప్ చేశారో చూశానని, చాలా ఇన్ స్పైరింగ్ గా ఉందని అన్నారు. విద్య, ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెడతామని మహేష్ బాబు చెప్పారు. ఆంధ్రా హాస్పిటల్స్, సిద్ధార్థ మెడికల్ కళాశాలకు ఈ సందర్భంగా కృతఙ్ఞతలు చెబుతున్నానన్నారు. అంతకుముందు, పేదలకు ఇళ్ల పట్టాలను, మహిళా సంఘాలకు కోటి రూపాయల చెక్కును, హెల్త్ కార్డులను ఆయన పంపిణీ చేశారు.

  • Loading...

More Telugu News