: ఇలా ఎంతమంది మహిళలను అవమానిస్తారు?: టీఆర్ఎస్ కి సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల బహిరంగ లేఖ
ఇలా ఎంతమంది మహిళలను అవమానిస్తారు? అంటూ టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ మాజీ మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలు బహిరంగ లేఖలో ప్రశ్నించారు. పాలేరు ఉపఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ మహిళా నేతలు బహిరంగ లేఖలు రాస్తున్నారు. గత వారం పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి సుచరితా రెడ్డి బహిరంగ లేఖ ద్వారా ప్రశ్నించగా, ఈసారి మాజీ మంత్రులు ఆ బాధ్యతను తీసుకున్నారు. టీఆర్ఎస్ మహిళలను అవమానిస్తోందని ఆ లేఖలో పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ అమరవీరుడు శ్రీకాంత్ చారి తల్లికి టికెట్టిచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఆ తరువాత ఆమెను పట్టించుకోలేదని వారు లేఖలో ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను ఎందుకు ఎమ్మెల్సీని చేయలేదని ప్రశ్నించారు. గతంలో ఎవరైనా శాసనసభ్యులు మృతి చెందితే...వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకే స్థానం కల్పించడం సంప్రదాయమని, టీఆర్ఎస్ పార్టీ సంస్కారం మరిచి, మరణించిన వారిపై విమర్శలకు దిగి దుస్సంప్రదాయానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. రాంరెడ్డి వెంకటరెడ్డి మరణం తరువాత సుచరితారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్ మెంట్ అడిగితే ఆయన ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే దమ్ములేక టీఆర్ఎస్ పార్టీ 10 మంత్రులు, 60 మంది ఎమ్మెల్యేలను రంగంలోకి దింపిందని వారు తెలిపారు. వీరికి ప్రజలే బుద్ధి చెప్పాలని వారు లేఖలో కోరారు.