: నా మీద నమ్మకంతోనే రాజధాని నిర్మాణానికి రైతులు 34వేల ఎకరాల భూమి ఇచ్చారు: చంద్రబాబు
రాయలసీమ పర్యటనలో భాగంగా కడప జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్ది సేపటి క్రితం కర్నూలుకి చేరుకున్నారు. కర్నూలులోని కురువెల్లిలో ఏర్పాటు చేసిన నీరు-చెట్టు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన మీద నమ్మకంతోనే రాజధాని నిర్మాణానికి రైతులు 34వేల ఎకరాల భూమి ఇచ్చారని, వారి కలలు నెరవేర్చితీరుతానని అన్నారు. నీరులేకపోతే మన మనుగడ లేదని నీరు-చెట్టు కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ పాల్గొనాలని అన్నారు. కష్టపడకపోతే భవిష్యత్తులో సుఖం ఉండదని, నేడు నీటిని ఆదాచేసుకుంటే భవిష్యత్తులో దాని కొరత ఉండదని వ్యాఖ్యానించారు. భావితరాల భవిష్యత్తు కోసమే తాను పనిచేస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులు అన్నిటినీ పూర్తిచేస్తానని హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లాను కరవు రహిత జిల్లాగా చేయాలని అధికారులు, ప్రజలకు పిలుపునిచ్చారు. నీటిని పరిరక్షించే బాధ్యత ప్రతీఒక్కరూ తీసుకోవాలన్నారు. గ్రామాలను స్మార్ట్ గ్రామాలుగా చేస్తామన్నారు. ప్రతీ ఇంటికి వంటగ్యాస్ ఇస్తామన్నారు.