: మోదీ సర్కారు అస్థిరతకు దావూద్ కుట్ర!... ఆరెస్సెస్ నేతలను టార్గెట్ చేసిన అండర్ వరల్డ్ డాన్!
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత దేశంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. గుజరాత్ సీఎంగా ఉంటూనే కేంద్ర రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసిన నరేంద్ర మోదీ తన సమ్మోహనాస్త్రంతో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ సాధించిపెట్టారు. వెనువెంటనే గుజరాత్ సీఎం పదవికి రాజీనామా చేసిన ఆయన భారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో భారత్ లో సుదీర్ఘ కాలం తర్వాత సుస్థిర ప్రభుత్వం ఏర్పడిందని అగ్రరాజ్యం అమెరికా సహా పలు ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇంతటి సుస్థిర ప్రభుత్వాన్ని కూడా ఆస్థిరపరచేందుకు యత్నాలు జరిగాయట. ఈ యత్నాలు చేసింది మరెవరో కాదు... 1993లో ముంబైలో మారణహోమం సృష్టించిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీమే. ఈ సంచలన విషయాలతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రేపు ఓ చార్జీషీట్ ను కోర్టులో దాఖలు చేయనుంది. ఈ మేరకు ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నేటి తన సంచికలో ఓ ఆసక్తికర కథనాన్ని రాసింది. సదరు కథనం వివరాల్లోకెళితే... నరేంద్ర మోదీ సర్కారును అస్థిరపరచేందుకు దావూద్ తన డీ కంపెనీకి చెందిన 10 మంది కరుడుగట్టిన గూండాలను రంగంలోకి దించాడు. అసలు వీరి ప్లాన్ వింటే షాకవ్వాల్సిందే. మోదీ సర్కారును అస్థిరపరచేందుకు నేరుగా సర్కారు, మంత్రులను టార్గెట్ చేసేందుకు ఆసక్తి చూపని డీ కంపెనీ... బీజేపీ సైద్ధాంతికకర్తగా పేరుగాంచిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)కు చెందిన కీలక నేతలపై దాడులు చేసేందుకు పక్కా ప్రణాళిక రచించింది. ఆరెస్సెస్ నేతలనే కాకుండా చర్చిలను కూడా లక్ష్యంగా ఎంచుకున్న డీ గ్యాంగ్... దేశంలో అల్లర్లను ఎగదోసేందుకు స్కెచ్ వేసింది. ఇందులో భాగంగా గతేడాదే దేశంలోకి ఎంటరైన డీ గ్యాంగ్... గుజరాత్ లో ఇద్దరు ఆరెస్సెస్ నేతలను పొట్టనబెట్టుకుంది. ఈ కేసును దాదాపుగా ఛేదించిన ఎన్ఐఏ... రేపు కోర్టులో చార్జిషీటును దాఖలు చేయనుంది.