: ప్రత్యేక హోదాపై లోక్‌సభలో ఏపీ ఎంపీల పట్టు.. స్పష్టత ఇవ్వని అరుణ్‌జైట్లీ
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై ప్రకటన చేయాలని పార్లమెంట్ లో ఏపీ ఎంపీలు పట్టుబట్టారు. ఈ సందర్భంగా లోక్‌సభలో మాట్లాడిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రత్యేక హోదాపై స్పష్టత ఇవ్వలేదు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేస్తామని మాత్రం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వాల్సిన ప్రతీ పైసా ఇస్తామని చెప్పారు. ఏపీకీ కేంద్ర పన్నువాటా అనుకున్నదాని కంటే ఎక్కువగానే వచ్చిందన్నారు. విభజన చట్టం ప్రకారం ఇప్పటివరకు ఏపీకి రూ.6403 కోట్లు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. తొలి ఏడాది ఏపీకి రెవెన్యూ లోటుగా రూ.2800 ఇచ్చామన్నారు. పోలవరానికి కూడా నిధులు కేటాయిస్తున్నామని అరుణ్ జైట్లీ తెలిపారు. పోలవరంపై జైట్లీ మాట్లాడే సమయంలో ఒడిశా సభ్యులు అడ్డుతగిలారు. ఒడిశా నుంచి అభ్యంతరాలున్నప్పటికీ పోలవరం పనులు పూర్తి చేస్తామని అరుణ్ జైట్లీ ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం చిత్తశుద్ధితో ఉందని అన్నారు.