: నాకు డబ్బు అవసరమైనప్పుడే కమర్షియల్ చిత్రాల్లో నటిస్తాను: మనోజ్ బాజ్ పేయ్
తనకు డబ్బు అవసరమైనప్పుడు మాత్రమే కమర్షియల్ సినిమాల్లో నటిస్తానని బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పేయ్ అన్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం తాను ఎటువంటి కమర్షియల్ చిత్రంలో నటించడం లేదని, ఆ తరహా చిత్రాలకు తన అవసరం కూడా లేదని అన్నారు. అయితే, కమర్షియల్ చిత్రాల్లో నటించాలంటూ తనకు వచ్చే అవకాశాల సంఖ్య కూడా తక్కువగా ఉంటుందన్నారు. కాగా, గతంలో తెలుగులో విడుదలైన ‘వేదం’ చిత్రంలో ఒక ముఖ్యపాత్రను పోషించిన మనోజ్ బాజ్ పేయ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హిందీలో సత్య, రాజ్ నీతి, గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ వంటి సినిమాల్లో ఆయన నటించారు. మనోజ్ బాజ్ పేయ్ నటించిన ‘ట్రాఫిక్’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.