: మోదీకి డిగ్రీ లేదా?...ఉంటే చెప్పడానికి అభ్యంతరం ఏంటి?: ఢిల్లీ యూనివర్సిటీకి కేజ్రీవాల్ ప్రశ్న
ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీల విషయంలో ఢిల్లీ యూనివర్సిటీ ఎందుకు దోబూచులాడుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ల పరంపర కొనసాగించారు. తనకు తెలిసినంత వరకు ప్రధాని మోదీ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేయలేదని ఆయన చెప్పారు. గతంలో మోదీ సర్టిఫికేట్లు అంటూ ప్రచురించినవి ఫోర్జరీ సర్టిఫికేట్లని ఆయన అన్నారు. గతంలో తన సర్టిఫికేట్ల గురించి సురబ్జిత్ రాయ్ అనే వ్యక్తి ఖరగ్ పూర్ ఐఐటీని సంప్రదించగా, వారు అతనికి వివరాలు అందించారని అతని లేఖను కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. మరి ప్రధాని సర్టిఫికేట్ల గురించి ఢిల్లీ యూనివర్సిటీ ఎందుకు దోబూచులాడుతోందని ఆయన నిలదీశారు. అంటే ఆయనకు డిగ్రీ లేదని అర్థమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. మోదీ ఢిల్లీ యూనివర్సిటీలో చేరడం, డిగ్రీ, మార్కుల జాబితా, స్నాతకోత్సవం తదితరాలకు సంబంధించిన రికార్డులేవీ ఢిల్లీ యూనివర్సిటీ వద్ద లేవని ఆయన చెప్పారు.