: మనవడు దేవాన్ష్ కు దగ్గరయ్యేందుకు హైదరాబాదు వచ్చిన చంద్రబాబు!
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిన్న రాత్రి విజయవాడ నుంచి హైదరాబాదు వచ్చారు. తీవ్ర పని ఒత్తిడితో సతమతమవుతున్న చంద్రబాబు... తన మనవడు దేవాన్ష్ తో కాసేపు గడిపేందుకే హైదరాబాదు వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రోజుల తరబడి తాను కనిపించకపోవడంతో తన మనవడు తన వద్దకు వచ్చేందుకే వెనుకాడుతున్నాడని, ఎప్పుడైనా దగ్గరకు తీసుకుందామంటే ఏడుస్తూ దూరంగా వెళుతున్నాడని ఇటీవల సహచర మంత్రులకు చెప్పుకుని చంద్రబాబు బాధపడ్డారు. ఈ క్రమంలోనే నిన్న రాత్రి ఆయన హైదరాబాదు వచ్చినట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో ఆయన హైదరాబాదు నుంచి బయలుదేరి నేరుగా ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనకు వెళతారు.