: గుజరాత్ ను ఆదుకున్న కార్తిక్, జడేజా, రైనా...ఢిల్లీ లక్ష్యం 150
ఐపీఎల్ సీజన్ 9లో భాగంగా రాజ్ కోట్ వేదికగా గుజరాత్ లయన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్ల మధ్య 31వ టీ20 మ్యాచ్ ఆసక్తికరంగా జరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ లయన్స్ కు ఆదిలోనే షాక్ తగిలింది. గత మ్యాచుల్లో అద్భుత ప్రదర్శన కనబరచిన ఓపెనర్లు మెక్ కల్లమ్ (1), స్మిత్ (15) త్వరగా పెవిలియన్ చేరారు. అనంతరం వచ్చిన ఆరోన్ ఫించ్ (5) కూడా ఆకట్టుకోలేకపోయాడు. ఈ దశలో దిగిన కెప్టెన్ రైనా (24) ఆచితూచి ఆడాడు. అతనికి జత కలిసిన దినేష్ కార్తిక్ (53) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆపద్బాంధవుడి పాత్ర పోషించిన కార్తిక్ తో రవీంద్ర జడేజా (36) పోటీ పడి ఆడాడు. ఈ ముగ్గురూ రాణించడంతో గుజరాత్ తడబడి నిలబడింది. చివర్లో జేమ్స్ ఫల్కనర్ (7), ఇషాన్ కిషన్ (2)లు అవుట్ కావడంతో గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. ఢిల్లీ డేర్ డెవిల్స్ బౌలర్లలో నదీమ్ రెండు వికెట్లు తీయగా, జహీర్ ఖాన్, మోరిస్, షమి, మిశ్రా చెరో వికెట్ తీసి ఆకట్టుకున్నారు. కాసేపట్లో 150 పరుగుల విజయ లక్ష్యంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ బ్యాటింగ్ ప్రారంభించనుంది.