: ఫ్రాన్స్, జర్మనీ...అమెరికా, జపాన్ లకు సాధ్యమైనది మనకి ఎందుకు కాదు?: సోషల్ మీడియాలో యువతి సూటి ప్రశ్న
భారత్, పాకిస్థాన్ దేశాల నేతలకు సామాజిక మాధ్యమం వేదికగా పంజాబ్ లోని జలంధర్ కు చెందిన గుర్ మొహర్ కౌర్ (19) అనే యువతి మౌనంగా పాలకులను ప్రశ్నిస్తోంది. అందర్నీ ఆలోచింపజేస్తోంది. తన ఫేస్ బుక్ పేజ్ వేదికగా రెండు దేశాల ప్రభుత్వాలకు ఆమె ఒక వీడియో ద్వారా సూటి ప్రశ్నలు సంధించింది. ఆయా ప్రశ్నలను ప్లకార్డుల ద్వారా ఆమె ప్రదర్శించింది. ఇప్పుడీ ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. తన తండ్రి కెప్టెన్ మన్ దీప్ సింగ్ భారత ఆర్మీలో పని చేశారని, 1999లో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో మృతి చెందారని ఆమె ఓ ప్లకార్డు ద్వారా తెలిపింది. తన చిన్న వయసులోనే ఆయన వీర మరణం పొందడంతో తండ్రి స్పర్శకు, ప్రేమకు నోచుకోలేకపోయానని చెబుతూ ఆమె మరో ప్లకార్డు ప్రదర్శించింది. తన తండ్రి మృతికి కారణమైన పాకిస్థాన్ ను, అక్కడి ప్రజలను (ముస్లింలను) వ్యతిరేకించానని పేర్కొంటూ ఇంకో ప్లకార్డు ప్రదర్శించింది. తరువాతి ప్లకార్డులో తాను ఆరేళ్ల వయసులో ఉండగా బురఖా ధరించిన ఓ మహిళ తనపై హత్యాయత్నం చేసిందని గుర్తు చేసుకుంది. ఆ తరువాత తన తండ్రిని పాకిస్థాన్ చంపించలేదని, యుద్ధంలో ఆయన మరణించారని తన తల్లి తనకు చెప్పిందని మరో ప్లకార్డును చూపింది. అప్పుడు తాను వాస్తవం గ్రహించానని ఆమె ఇంకో ప్లకార్డుతో తెలిపింది. అప్పటి నుంచి సైనికురాలిగా శాంతి కోసం తాను యుద్ధంపై పోరాడుతున్నానని మరో ప్లకార్డు ద్వారా వెల్లడించింది. భారత్-పాకిస్థాన్ మధ్య శాంతి కోసం పోరుబాటపట్టానని ఇంకో ప్లకార్డు ద్వారా తెలిపింది. పంతాలకు పోకుండా రెండు దేశాలు శాంతిని నెలకొల్పాలని ఆమె తరువాతి ప్లకార్డు ద్వారా సూచించింది. రెండు ప్రపంచ యుద్ధాల తరువాత ఫ్రాన్స్, జర్మనీలు మిత్రదేశాలుగా మారాయని; అణుబాంబు వేసిన అమెరికా, ఆ దెబ్బకు నష్టపోయిన జపాన్ దేశాలు కూడా సామరస్యపూర్వక ధోరణిలో ముందుకు సాగుతున్నాయని; అదే విధానం భారత్-పాకిస్థాన్ మధ్య ఎందుకు కుదరదని ఆమె ప్లకార్డుల ద్వారా ప్రశ్నించింది. రెండు దేశాల ప్రజలు శాంతి, సామరస్యం కోరుతున్నారు కానీ యుద్ధం కాదని ఆమె ప్లకార్డు ద్వారా స్పష్టం చేసింది. తీవ్రవాదానికి, గూఢచర్యానికి, విద్వేషాలకు పాల్పడవద్దని ఆమె సూచించింది. సరిహద్దుల్లో మారణహోమం ఆగాలని ఆమె ప్లకార్డు ద్వారా ఆకాంక్షించింది. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో పెద్ద చర్చకు తెరతీసింది. ఒక్క మాట కూడా నోటితో చెప్పకుండా, రెండు దేశాలకు ఆ యువతి చేసిన హితబోధ తీరును అంతా అభినందిస్తున్నారు.