: ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై మండిపడ్డ వైఎస్సార్సీపీ నేత భూమన
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలోని రంగారెడ్డి-పాలమూరు ప్రాజెక్టుపైనే కాకుండా, ఈ రాష్ట్రంలో నిర్మితమవుతున్న పలు ప్రాజెక్టులపై ఏపీ సీఎం చంద్రబాబు నోరు మెదపడం లేదని ఆరోపించారు. ఇక్కడి ప్రాజెక్టులను అడ్డుకోవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు... అనుమతులు తీసుకుని ప్రాజెక్టులు నిర్మించాలని స్వయంగా ఆయనే సలహాలివ్వడంపై భూమన మండిపడ్డారు. ఈ సందర్భంగా తెలంగాణలో కేసీఆర్ సర్కార్ పై కూడా ఆయన పలు విమర్శలు చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినంత మాత్రాన తమ పార్టీని బలహీనపర్చలేరని అన్నారు. ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాక్కోవడం ద్వారా వైఎస్సార్సీపీని బలహీన పరుస్తున్నామని కనుక ఎవరైనా అనుకుంటే అది ఒట్టి భ్రమేనన్నారు.తెలంగాణ ప్రభుత్వ ఆగడాలను చూస్తూ ఊరుకోమని అన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కొత్త ప్రాజెక్టులు కట్టాలంటే జలవనరుల శాఖ అనుమతులు ఉండాలన్న విషయం విభజన చట్టంలో ఉందని, దీనిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. కాగా, తెలంగాణ చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులకు నిరసనగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 16,17,18 తేదీల్లో కర్నూలులో దీక్ష చేపట్టనున్నారని భూమన తెలిపారు.