: లాక్కుని కౌగిలించుకోవడానికి కేజ్రీ ఏమైనా హీరోయినా?: లాలూ కామెంట్


అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంలో సోనియా గాంధీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై బీహార్ మాజీ సీఎం, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీ అతి చేస్తున్నారని కాస్తంత ఘాటు వ్యాఖ్యలు చేసిన లాలూ... ఢిల్లీ సీఎం తీరుపై విస్మయం వ్యక్తం చేశారు. అసలు విషయమేమిటంటే, బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ పదవీ ప్రమాణం చేసిన సందర్భంగా కేజ్రీని లాలూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఫొటోలు నాడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అవినీతిపరుడైన లాలూతో ఆ ఆలింగనాలేంటని నెటిజన్లు కేజ్రీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో విమర్శలను తప్పించుకునే క్రమంలో కేజ్రీ... లాలూ ప్రసాద్ యాదవే తనను బలవంతంగా తన దగ్గరకు లాక్కుని ఆలింగనం చేసుకున్నారని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా కొద్దిసేపటి క్రితం పాట్నాలో లాలూ ఘాటు స్పందించారు. ‘‘బలవంతంగా లాక్కుని కౌగిలించుకోవడానికి కేజ్రీ ఏమైనా హీరోయినా?’’ అని లాలూ వ్యాఖ్యానించడంతో అక్కడి మీడియా ప్రతినిధులు నవ్వాపుకోలేకపోయారు.

  • Loading...

More Telugu News