: కేసీఆర్ దత్తపుత్రిక ప్రేమ కథ ఇదే!
నిత్యమూ తండ్రి, పినతల్లి చేతుల్లో తీవ్ర చిత్ర హింసలకు గురై, ఆపై మహిళా సంఘాల చొరవతో ఆసుపత్రిలో చేరి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా దిగివచ్చి దత్తత తీసుకున్న ప్రత్యూష ప్రేమ కథ, ఆమె ప్రేమించిన యువకుడి వివరాలు వెలుగులోకి వచ్చాయి. తాను ప్రేమించిన యువకుడిని వివాహం చేసుకుంటానని, ఆమె అధికారులకు చెప్పగా, కేసీఆర్ నిర్ణయం తీసుకునేంత వరకూ ఈ విషయంలో ఎలాంటి చర్యలూ తీసుకోరాదని, కనీసం ప్రత్యూష ఆ యువకుడితో మాట్లాడకుండా చూడాలని సీఎంఓ అధికారులు ఆదేశించినట్టు వార్తలు వచ్చాయి. ఇక ప్రత్యూష ప్రేమ కథకు వెళితే, ఆమె ప్రేమించిన యువకుడి పేరు మద్దిలేటి వెంకట్ (బుజ్జి)గా తెలుస్తోంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన ఈ యువకుడు తమ బంధువుల చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి వచ్చిన వేళ, అదే సమయంలో అక్కడే తన కంటికి చికిత్స పొందుతున్న ప్రత్యూష పరిచయమైంది. ఆపై మాటలు కలవడం, స్నేహం, ఫోన్ నంబర్ల మార్పిడి, వాట్సాప్ చాటింగ్, ఫోటోలు షేరింగ్... ఇలా సాగిన పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ పెళ్లి రెండు తెలుగు రాష్ట్రాల ఇంటెలిజెన్స్ అధికారులకు పని పెట్టింది. బుజ్జి ఆచూకీ, పూర్తి వివరాల కోసం తెలంగాణ అధికారులు ఏపీని సంప్రదించారు. ఇతను ఆళ్లగడ్డలోని ఓ ఆటోమొబైల్ దుకాణంలో గుమాస్తాగా పనిచేస్తున్నట్టు గుర్తించారు. అన్నీ సక్రమంగా జరిగితే, కేసీఆర్ ఇంటికి బుజ్జి అల్లుడిగా వెళతాడేమో!