: బీహార్ సీఎం నితీశ్ పై చెప్పు విసిరిన యువకుడు!... కేసు పెట్టద్దన్న ముఖ్యమంత్రి!
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై నిన్న చెప్పు పడింది. వినతి పత్రం ఇస్తానంటూ నితీశ్ కు అతి సమీపంగా వచ్చిన ఓ యువకుడు... క్షణాల్లో కాలికున్న చెప్పు తీసి నితీశ్ పై విసిరేశాడు. సదరు చెప్పు నితీశ్ ఛాతీ భాగంలో ఎడమ వైపు తాకింది. తెల్లటి నితీశ్ చొక్కాపై సదరు చెప్పు గుర్తు కూడా పడిపోయింది. సదరు చెప్పు తనకు తాకిన విషయాన్ని స్వయంగా ప్రకటించిన నితీశ్... చెప్పు దాడితో తన చొక్కాపై పడ్డ మరకను ఆయన స్వయంగా మీడియాకు చూపారు. ఇక నితీశ్ పై చెప్పును విసిరిన వ్యక్తి పేరు కూడా నితీశ్ కుమారే కావడం గమనార్హం. వివరాల్లోకెళితే... ఎండలు మండుతున్న నేపథ్యంలో పగటి పూట పొయ్యి వెలిగించరాదని నితీశ్ సర్కారు ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. వంటతో పాటు పూజాదికాల్లోనూ పొయ్యి వెలిగించరాదని కూడా సదరు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ప్రమాదాల నివారణకే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిర్ణయం నితీశ్ కుమార్ అనే ఓ హిందూ యువకుడిని ఆగ్రహావేశాలకు గురి చేసింది. పొయ్యి వెలిగించరాదని ఆదేశాలు ఇచ్చి... హిందువులను పూజలు చేయవద్దంటారా? అంటూ అతడు ఆవేశానికి లోనయ్యాడు. నిన్న సీఎం నితీశ్ కుమార్ తన అధికారిక నివాసంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే ‘జనతా దర్బార్’కు హాజరయ్యారు. దర్బార్ కు వచ్చిన యువకుడు నితీశ్... సీఎం నితీశ్ కు వినతి పత్రం ఇస్తానంటూ ముందుకు వచ్చాడు. సీఎం దగ్గరకు రాగానే అతడు వంగి తన కాలికున్న చెప్పు తీసి విసిరాడు. అది నేరుగా సీఎం నితీశ్ ఛాతి భాగానికి తాకింది. వెంటనే తేరుకున్న సీఎం భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడిపై కేసు మాత్రం పెట్టవద్దని సీఎం నితీశ్ కుమార్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.