: అంజలి వెయిట్ చేస్తుందో, లేదోనని భయపడేవాడిని: సచిన్ టెండూల్కర్
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన భార్య, నాటి గర్లఫ్రెండ్ అయిన అంజలితో ప్రేమలో పడ్డప్పటి నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇటీవల ముంబయిలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సచిన్ ఈ విషయాన్ని చెప్పారు. స్మార్ట్ ఫోన్లు లేని కాలంలో తమ ప్రేమ వికసించిందని అన్నారు. అంజలితో తన ప్రేమ వ్యవహారం తమ కుటుంబసభ్యులకు తప్ప మరెవ్వరికీ తెలియదన్నారు. అంజలి జేజే హాస్పిటల్స్ లో చదువుకోవడంతో పాటు అక్కడే నివసించేదని చెప్పారు. అయితే, ఆమెను కలిసేందుకు వెళ్లేముందు బాంద్రా నుంచి ల్యాండ్ లైన్ ద్వారా ఫోన్ చేసి ఒక గంట లోగా తనని కలుస్తానని చెప్పేవాడినన్నారు. అప్పట్లో బాంద్రా నుంచి వర్లికీ వెళ్లేందుకు సీ లింక్ లేదని, ఆమెతో మాట్లాడలంటే కేవలం ల్యాండ్ లైన్లు మాత్రమే అందుబాటులో ఉండేవని అన్నారు. తీరా, హాస్పిటల్ కు చేరేసరికి, ఎమర్జెన్సీ కేసులు లేదా పేషెంట్లకు సూచనలిచ్చే పనిలో అంజలి చాలా బిజీగా ఉండేదని, ఒక్కోసారి తనను కలవడం ఆమెకు వీలయ్యేది కాదన్నారు. అంజలి కోసం తాను వెళ్లేటప్పుడు ఆమె కలుస్తుందో లేదోనని, వెయిట్ చేస్తుందో లేదోననే దిగులు, భయం తనకు కలిగేవని సచిన్ అన్నారు. ఒకోసారి.. ఆమె తనను కలవటం లేదనే విషయం తెలిసిన తర్వాత తాను మళ్లీ బాంద్రా వెళ్లి మరో ఫోన్ కాల్ అంజలికి చేసి, మళ్లీ వస్తున్నానని చెప్పి... చివరకు ఏదోవిధంగా అంజలిని కలిసేవాడినంటూ సచిన్ చెప్పుకొచ్చారు. ఆ కాలంలో స్మార్ట్ ఫోన్లు అందుబాటులో లేకపోవడం వల్ల సమాచారం చేరవేసేందుకు చాలా సమయం పట్టేదన్నారు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం నిమిషాల్లో ఒక ఫోన్ కాల్ లేదా మెస్సెజ్ పంపుకునే అవకాశం ఉందని సచిన్ అన్నారు.