: చిట్టచివరికి రాందేవ్ 'పతంజలి' బాటలోకి వచ్చేస్తున్న కోల్గేట్!


యోగా గురు రాందేవ్ బాబా 'పతంజలి' ఉత్పత్తులు తమ మార్కెట్ అవకాశాలను దెబ్బతీస్తాయని భావిస్తున్న కోల్గేట్ పామోలివ్ భారీ ఎత్తున కొత్త ప్లాన్లు రూపొందిస్తోంది. ఇండియాలో దంత సంరక్షణ ఉత్పత్తుల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న కోల్గేట్ బ్రాండ్ అమ్మకాలు గత కొంత కాలంగా తగ్గుతున్న సూచనలు కనిపిస్తుండటం, ఇదే సమయంలో పతంజలి ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతుండటంతో నష్ట నివారణకు దిగారు కోల్గేట్ పామోలివ్ గ్లోబల్ సీఈఓ ఇయాన్ కుక్. "ఇండియాలో సహజ ఉత్పత్తుల రంగం శరవేగంగా విస్తరిస్తోంది. ఈ రంగంలోనూ మా ఉత్పత్తులు రానున్నాయి. ఇండియాలోని స్థానిక పోటీదారుల నుంచి వస్తున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటాం" అని ఇన్వెస్టర్లకు ఇయాన్ తెలిపారు. కాగా, ఇండియాలోని దంత సంరక్షణ ఉత్పత్తుల మార్కెట్ 2015తో పోలిస్తే 2015లో 0.8 శాతం పెరిగి రూ. 6 వేల కోట్లను దాటింది. గ్రామీణ ప్రాంతాల నుంచి డిమాండ్ తగ్గడం వల్లనే వృద్ధి అనుకున్నంతగా నమోదు కాలేదని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ రంగంలో వినూత్న ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నామని, 2016లో ఇవి మార్కెట్లోకి వస్తాయని కుక్ వ్యాఖ్యానించారు. ఎనిమిది సంవత్సరాల నాడు 48 శాతంగా ఉన్న కోల్గేట్ పామోలివ్ భారత మార్కెట్ వాటా 54 శాతానికి పెంచుకోగలిగామని కుక్ గుర్తు చేసుకున్నారు. ఇదే సమయంలో కోల్గేట్ బ్రాండ్ కు ప్రధాన పోటీదారుగా ఉన్న హిందుస్థాన్ యూనీలివర్ మార్కెట్ వాటా 29 శాతం నుంచి 21 శాతానికి పడిపోగా, పతంజలి ఉత్పత్తుల వాటా అనతికాలంలోనే 13 శాతాన్ని దాటింది. ఒక్క 'దంతకాంతి' ఉత్పత్తి ఈ ఏడు రూ. 450 కోట్ల మార్కెట్ ను నమోదు చేస్తుందని అంచనా.

  • Loading...

More Telugu News