: తెలంగాణలో మరో రెండు రోజులే వైసీపీ!... 4న కారెక్కనున్న పొంగులేటి, పాయం
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం నుంచి మరో రెండు రోజుల్లో ఓ పార్టీ మాయం కానుంది. ఏపీలో విపక్ష పార్టీ హోదాలో ఉన్న వైసీపీ మరో రెండు రోజుల పాటు మాత్రమే తెలంగాణలో అస్తిత్వంలో ఉంటుంది. ఈ నెల 4 తర్వాత ఆ పార్టీ పేరు తెలంగాణలో దాదాపుగా వినిపించదు. ఆ పార్టీకి చెందిన తెలంగాణ శాఖ... తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ లో విలీనం కానుంది. ఈ మేరకు నేటి ఉదయం వైసీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి పార్టీని వీడనున్నట్లు ముఖం మీదే చెప్పేశారు. వెనువెంటనే ఆయన ఖమ్మం బయలుదేరిపోయారు. కొద్దిసేపటి క్రితం ఆయన తన ముఖ్య అనుచరులతో ఖమ్మంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీకి ఖమ్మం జిల్లా పినపాక ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ నేత పాయం వెంకటేశ్వర్లు కూడా హాజరయ్యారు. ఈ నెల 4న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకునేందుకు వారు నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత వైసీపీని టీఆర్ఎస్ లో విలీనం చేయనున్నట్లు వారు ప్రకటించనున్నారు. దీంతో ఈ నెల 4 తర్వాత తెలంగాణలో వైసీపీ పేరు వినిపించదు.