: భూమా, శిల్పా మధ్య రాజీ కుదిరేనా?... చంద్రబాబు వద్దకు తరలివెళ్లిన నేతలు
టీడీపీ కర్నూలు జిల్లా శాఖలో నెలకొన్న ఆధిపత్య పోరుకు ముగింపు పలికేందుకు ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టారు. మొన్నటిదాకా వైసీపీలో ఉన్న భూమా నాగిరెడ్డి, అప్పటికే కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి దూకేసిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డిల మధ్య ఆది నుంచి వర్గ పోరు సాగుతోంది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భూమా కూడా ఇటీవలే తన సొంత పార్టీ టీడీపీలోకి చేరిపోయారు. ఈ క్రమంలో పార్టీలో పైచేయి సాధించేందుకు ఇరువురు నేతలు బహిరంగంగానే ఢీకొన్నారు. శిల్పా అనుచరుడిపై భూమా వర్గం దాడితో వారిద్దరి మధ్య వర్గ విభేదాలు మరింత ముదిరాయి. ఆ సందర్భంగా ఇరువురు నేతలు ఒకరిపై మరొకరు పార్టీ అధినేతకు ఫిర్యాదులు చేసుకున్నారు. అయితే, మొన్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి టీడీపీలో చేరిన సందర్భంగా శిల్పా సోదరుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, భూమాల మధ్య మాటలు కలిశాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో పార్టీ స్థితిగతులపై చర్చించుకుందాం రమ్మంటూ చంద్రబాబు నుంచి పిలుపు రావడంతో శిల్పా మోహన్ రెడ్డి, భూమా నాగిరెడ్డిలు నిన్న రాత్రే విజయవాడకు బయలుదేరారు. వీరితో పాటు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, జిల్లా అధ్యక్షుడి హోదాలో మోహన్ రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డి కూడా వారి వెంట విజయవాడకు తరలివెళ్లారు. వీరందరితో ప్రత్యేకంగా భేటీ కానున్న చంద్రబాబు... వర్గ విభేదాలు వీడి ఐక్యంగా ముందుకు సాగాల్సిందేనని హుకుం జారీ చేయనున్నట్లు సమాచారం. పార్టీ అధినేత ఆదేశాలను భూమా, శిల్పా పాటిస్తారా? లేదా? అన్న విషయంపై కర్నూలు జిల్లాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.