: పిచ్చి ప్రయత్నాలు మానుకోండి: ప్రతిపక్షాలకు కేసీఆర్ సూచన
కరీంనగర్ జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్నారు. అక్కడి మేడిగడ్డలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేసీఆర్ దంపతులు భూమిపూజ చేశారు. అనంతరం మీడియాతో కేసీఆర్ మాట్లాడుతూ... ‘తెలంగాణ ప్రజల తాగు, సాగునీటి గోస తీర్చడమే మా లక్ష్యం, ప్రతి పక్షాలు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై విమర్శలు చేస్తున్నాయి’ అని అన్నారు. ప్రతిపక్షాలు పిచ్చి ప్రయత్నాలు చేయడం మానుకోవాలని సూచించారు. తెలంగాణలో 18లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే తమ లక్ష్యమని వివరించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఉత్తర తెలంగాణకు వరప్రదాయిని అని అన్నారు. మేడిగడ్డ దగ్గర రూ.84వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నామని, మహారాష్ట్ర ముఖ్యమంత్రితో భేటీ తరువాత పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తవుతుందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి చేసిన భూమిపూజ కార్యక్రమంలో కేసీఆర్ దంపతులతో పాటు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.