: యువతను ఆకర్షించేందుకు భారత ఉగ్రవాదిని 'పోస్టర్ బాయ్'ని చేసిన ఐఎస్ఐఎస్
ఇండియాలోని ముస్లిం యువతను ఉగ్రవాదం వైపునకు మరింతగా ఆకర్షించేందుకు ఐఎస్ఐఎస్ ఇంకో ప్లాన్ వేసింది. భారత ఉగ్రవాది, కర్ణాటకలోని భత్కల్ ప్రాంతానికి చెందిన అన్వర్ హుస్సేన్ ను 'పోస్టర్ బాయ్'ని చేస్తూ, కొత్త వీడియోను రూపొందించింది. వ్యాన్ డ్రైవర్ గా పనిచేస్తూ, ఆపై ఆఫ్గనిస్తాన్ వెళ్లి, ఉగ్రవాదుల్లో కలిసిన అన్వర్, 2014లో మరణించాడు. కాగా, ఈ వీడియోలో అన్వర్ ను చూపుతూ "జీహాద్ మన విధి. ఇందుకోసం ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చాం. మనకు అల్లా మంచి భోజనం ఇచ్చాడు. మంచి స్నేహితులను ఇచ్చాడు. యుద్ధం చేయమని చెబుతూ అన్నీ ఇచ్చాడు" అన్న సందేశం ఉంది. దీంతో పాటు "నేను ఇక్కడికి ఎవరి ప్రోద్బలంతోనో రాలేదు. నా అంతట నేనే వచ్చాను" అని అన్వర్ చెబుతున్నట్టూ ఉందని 'మెయిల్ టుడే' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. 14 నిమిషాలున్న వీడియోలో హుస్సేన్ భారత నేపథ్యం, జీహాద్ పట్ల అతని అభిప్రాయాలు ఉన్నాయి. హుస్సేన్ మరణించిన రోజు ఆయన ఉపవాస దీక్ష చేస్తున్నాడని, అతనితో పాటు పనిచేసిన ఇతర ఉగ్రవాదులు ఈ వీడియోలో తెలిపారు. ఈ తరహా ప్రచారాన్ని విస్తృతం చేయడం ద్వారా ఇండియాలోని భారత ముస్లిం యువతను ఉగ్రవాదం పట్ల ఆకర్షితులను చేయడమే ఐఎస్ఐఎస్ లక్ష్యమని సెక్యూరిటీ నిపుణుడు సుశాంత్ సరీన్ వ్యాఖ్యానించారు. కొంతమంది యువకులు, వీటిని చూసి ప్రభావితం అవుతున్నారన్న ఆందోళనను వ్యక్తం చేశారు.