: 123 కోట్ల మందిలో పన్ను చెల్లించేది కేవలం 1.25 కోట్ల మందే!
భారత జనాభాలో పన్ను చెల్లిస్తున్న వారెందరో తెలుసా? కేవలం ఒక్క శాతం మాత్రమే. పన్ను చెల్లింపు విధానాన్ని మరింత పారదర్శకం చేసేలా, కేంద్ర ప్రభుత్వం తన వద్ద ఉన్న పూర్తి సమాచారాన్ని బహిర్గతం చేయగా, పలు ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. 2012-13 అసెస్ మెంట్ సంవత్సరంలో (మార్చి 31, 2012తో ముగిసిన ఆర్థిక సంవత్సరం) రూ. 1 కోటికి పైగా పన్ను కట్టిన వారి సంఖ్య కేవలం 5,430. ఇక ఇదే సంవత్సరంలో మొత్తం 2.87 కోట్ల మంది తమ ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేశారు. వీరిలో 1.62 కోట్ల మంది ఎలాంటి పన్నునూ చెల్లించలేదు. అంటే, మిగిలిన 1.25 కోట్ల మంది నుంచి మాత్రమే ప్రభుత్వానికి పన్ను అందింది. దేశ జనాభా అధికారిక లెక్కల ప్రకారం 123 కోట్లు కాగా, సుమారు ఒక శాతానికి పైగా ప్రజల నుంచి మాత్రమే పన్ను వసూలైనట్టయింది. ఈ సమాచారం ప్రకారం, 2000-01లో రూ. 31,764 కోట్ల పన్ను వసూలు కాగా, అది 2015-16 నాటికి రూ. 2.86 లక్షల కోట్లకు చేరి తొమ్మిది రెట్ల వృద్ధిని నమోదు చేసింది. ఇక 2012-13లో పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారిలో సాలీనా రూ. 5.5 లక్షల నుంచి రూ. 9.5 లక్షల వేతనాలున్న వారి సంఖ్యే అధికంగా ఉంది. ఈ టాక్స్ బ్రాకెట్లోని 20.23 లక్షల మంది రిటర్నులను దాఖలు చేశారు. రూ. 50 కోట్ల నుంచి రూ. 100 కోట్ల వేతనాన్ని పొందుతున్న వారు ఆరుగురు మాత్రమే ఉండగా, రూ. 2.5 నుంచి రూ. 3.5 లక్షల మధ్య జీతం తీసుకుంటున్న వారు 19.18 లక్షలుగా ఉన్నారు. హైఎండ్ లో రూ. 1 నుంచి 5 కోట్ల మధ్య వేతనం తీసుకుంటున్న వారు 17,515 మంది ఉన్నారని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.