: ఆ రెండు నిర్ణయాలే... జగన్ కొంపముంచాయా?


ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీకి జరుగుతున్న ఉప ఎన్నికకు సంబంధించి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయమే... ఆయన పార్టీని తెలంగాణలో అడ్రెస్ లేకుండా చేస్తోందా? అంటే, అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణకు వ్యతిరేకిగా టీడీపీకి ముద్ర వేసిన టీఆర్ఎస్... ఆ పార్టీని తెలంగాణలో నామరూపాల్లేకుండా చేయాలని కంకణం కట్టుకుంది. ఈ క్రమంలో కొనసాగిన ‘ఆపరేషన్ ఆకర్ష్’ లో ఇప్పటికే 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరిపోయారు. టీ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి, ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మినహా మిగిలినవారంతా కారెక్కేశారు. ఇక వైసీపీపైనా వల విసిరిన టీఆర్ఎస్... ఖమ్మం జిల్లాలో ఆ పార్టీకి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ఇద్దరిని లాగేసింది. ఆ తర్వాత టీఆర్ఎస్... వైసీపీని దాదాపుగా టార్గెట్ చేయలేదనే చెప్పాలి. అయితే ప్రస్తుతం ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీకి జరుగుతున్న ఉప ఎన్నికను గులాబీ దళం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఎమ్మెల్సీగానే కాక తన కేబినెట్ కీలక మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావును కేసీఆర్ తన పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపారు. తుమ్మలను ఎలాగైనా ఓడించాలని భావిస్తున్న కాంగ్రెస్... టీఆర్ఎస్ వైరి వర్గాలను కూడగట్టే యత్నం చేసింది. ఈ యత్నంలో భాగంగా ఆ పార్టీ నేతలు అటు టీడీపీతో పాటు ఇటు వైసీపీతోనూ మాట్లాడారు. కాంగ్రెస్ నేతల వాదనకు సరేనన్న వైఎస్ జగన్ పాలేరు బరిలో మాజీ మంత్రి, దివంగత నేత రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితారెడ్డికి మద్దతు పలికారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం టీఆర్ఎస్ ను ఆగ్రహావేశాలకు గురి చేసింది. ఇదిలా ఉండగానే కృష్ణా డెల్టాకు తెలంగాణ అన్యాయం చేస్తోందని ఆరోపించిన జగన్... తెలంగాణ సర్కారు చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టులకు నిరసనగా ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు కర్నూలులో దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన టీఆర్ఎస్... వైసీపీ ఎంపీ, ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుపై వల విసిరింది. తెలంగాణలో పార్టీ నానాటికీ ప్రాభవం కోల్పోతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఆకర్ష్ కు పొంగులేటి, పాయంలు సులువుగానే లొంగిపోయారన్న వాదన వినిపిస్తోంది. వెరసి జగన్ తీసుకున్న రెండు నిర్ణయాలే... తెలంగాణలో ఆయన పార్టీని గల్లంతు చేయనున్నాయన్న ఆసక్తికర చర్చ జరుగుతోంది.

  • Loading...

More Telugu News