: ప్రభుత్వంగా అంతంతమాత్రమే అయినా, తగ్గని మోదీ ప్రాభవం!


నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టి దాదాపు రెండేళ్లు కావస్తోంది. ఇప్పటివరకూ ప్రభుత్వ పనితీరు ఎలావుంది? ప్రజలు ఏ మేరకు సంతృప్తిగా ఉన్నారు? హామీలను నెరవేర్చడంలో మోదీ ప్రభుత్వం ముందడుగు వేసిందా? ఏఏ అంశాల్లో సర్కారు విఫలమైంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునేందుకు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ తాజాగా ఓ సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ప్రభుత్వం, మంత్రుల పనితీరు మాటెలా వున్నా ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రాభవం ప్రజల్లో చెక్కు చెదరలేదు. 15 రాష్ట్రాల్లో ఈ సర్వే నిర్వహించగా, ప్రధానిగా మోదీ పనితీరు పట్ల 70 శాతం మంది సంతృప్తిని వ్యక్తం చేశారు. మరో మూడేళ్ల తరువాత మోదీయే ప్రధాని కావాలన్నది తమ అభిమతమని వీరంతా చెప్పడం విశేషం. కొత్త ప్రభుత్వం రాకతో తమ జీవన ప్రమాణాల్లో మార్పేమీ లేదని 50 శాతానికి పైగా సర్వేలో పాల్గొన్న ప్రజలు అభిప్రాయపడగా, పరిస్థితి దిగజారిందని 15 శాతం మంది చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో ప్రజలకు, ముఖ్యంగా పేదలకు ప్రయోజనం ఏమీ లేదని 43 శాతం మంది, ప్రధాని తానిచ్చిన హామీలను నెరవేర్చారని 33 శాతం మంది, పాక్షికంగా మాత్రమే హామీలు నెరవేరాయని 48 శాతం మంది వెల్లడించారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని 32 శాతం మంది, ప్రపంచ స్థాయిలో భారత స్థానాన్ని మరింత పదిలం చేశారని 73 శాతం మంది అభిప్రాయపడ్డారు. మొత్తం మీద ఎన్డీయే ప్రభుత్వం సంయుక్తంగా సాధించింది తక్కువే అయినా, తాము మోదీ వెంట నిలుస్తామని సర్వేలో పాల్గొన్న అత్యధికులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News