: భువనగిరి అరోరా కళాశాలలో విద్యార్థుల ఆందోళన
నల్గొండ జిల్లా భువనగిరి అరోరా ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అటెండెన్స్ లేదంటూ వారిని డిటైన్ చేయడంతో నలభై ఆరు మంది విద్యార్థులు పరీక్షలకు దూరమయ్యారు. తమను పరీక్షలకు అనుమతించాలని, లేనిపక్షంలో ఆత్మహత్య చేసుకుంటామంటూ విద్యార్థులు కళాశాల బిల్డింగ్ పైకి ఎక్కారు. దీంతో, కళాశాలలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కాగా, అటెండెన్స్ చాలలేదని చెబుతున్న కళాశాల అధికారుల మాటలు అవాస్తవమని, కేవలం డబ్బు కోసమే తమను డిటైన్ చేశారంటూ బాధిత విద్యార్థులు ఆరోపిస్తున్నారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యంతో సంప్రదింపులు జరిపినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. కళాశాలకు చెందిన అధికారితో మాట్లాడేందుకు వారి తల్లిదండ్రులు ఈరోజు ప్రయత్నించినప్పటికీ ఆ అధికారి అందుబాటులో లేరు. దీంతో, ఆగ్రహించిన విద్యార్థులు కళాశాల బిల్డింగ్ పైకి ఎక్కారు. ఈ సంఘటనపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. కాగా, గత వారం రోజుల నుంచి అరోరా కళాశాలలో విద్యార్థులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. వారం రోజుల క్రితం కూడా ఒక విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. యాజమాన్యం అతనికి సర్దిచెప్పడంతో సమస్య పరిష్కారమైంది.