: అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన బాలీవుడ్ చిత్రాల్లో మూడో చిత్రంగా ‘భాగీ’
ఇండోనేషియన్ యాక్షన్ మూవీ 'ది రెయిడ్-రిడెంప్షన్', తెలుగు హిట్ సినిమా వర్షం (2004) నుంచి యాక్షన్ సీక్వెన్స్ లను రిఫరెన్స్ పాయింట్లుగా తీసుకొని తెరకెక్కినట్లు విశ్లేషకులు పేర్కొంటోన్న బాలీవుడ్ మూవీ ‘భాగీ’. టైగర్ ష్రాఫ్, శ్రద్ధాకపూర్ నటించిన ఈ మూవీ నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. తొలిరోజు ‘భాగీ’కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడంతో, తొలిరోజే రూ.11.87 కోట్ల వసూళ్లు రాబట్టి, బాలీవుడ్లో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో మూడో ప్లేస్లో నిలిచింది. భాగీ మూవీ.. టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్, సుధీర్ బాబు, సునీల్ గ్రోవర్ ప్రధాన తారాగణంగా తెరకెక్కింది. సంజీవ్ దత్ స్క్రిప్టు అందించిన ఈ రొమాంటిక్ యాక్షన్ మూవీకి షబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహించాడు. అయితే, మొదటిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టినప్పటికీ.. ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. నిర్మాత సాజిద్ నడియావాలాకు ఎంతగా లాభాలు తెచ్చిపెడుతుందో వేచిచూడాల్సిందే.