: వివాహ వేడుకలో ‘సంబరాల’ కాల్పులు!... కుప్పకూలిన పెళ్లి కొడుకు!


దేశంలో సంబరాల జోరు నానాటికీ పెరిగిపోతోంది. పెరిగిపోతోంది అనే కంటే వెర్రితలలు వేస్తోందని చెబితే బాగుంటుందేమో. మొన్నటికి మొన్న ఉత్తర భారతంలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో అందరూ చూస్తుండగానే ‘సంబరాల’ పేరిట జరిగిన కాల్పుల్లో పెళ్లి కొడుకు తండ్రి కుప్పకూలిపోయాడు. ఇక టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వివాహ వేడుకలోనూ కాల్పుల కలకలం చోటుచేసుకుంది. తాజాగా మొన్న (గురువారం) హర్యానాలోని హిసార్ లో జరిగిన ఓ వివాహ వేడుకలో ఏకంగా పెళ్లి కొడుకే కుప్పకూలాడు. వివాహ వేడుకలో బంధు మిత్రుల మధ్య నిలుచున్న వరుడు... ఓ వ్యక్తి చేతిలోని పిస్టల్ నుంచి దూసుకువచ్చిన బుల్లెట్ కారణంగా అక్కడే కూలబడిపోయాడు. వెనువెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా... ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన హిసార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నేషనల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వరుడిని గాయపరచిన పిస్టల్ పట్టుకున్న వ్యక్తి కూడా సదరు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాడు.

  • Loading...

More Telugu News