: అవినీతికి కేరాఫ్ అడ్రెస్ 'ఆదిమూలం'!... ఏపీ డీటీసీ అక్రమార్జన రూ.800 కోట్లు!


అతడో గ్రూప్-1 స్థాయి అధికారి. సర్వీసులో ఎంటర్ కాగానే రవాణా శాఖలో బాధ్యతలు స్వీకరించాడు. సర్వీసులో చేరిన నాటి నుంచే బల్ల కింద చేతులు పెట్టడం ప్రారంభించాడు. ఎంతగానంటే... నిత్యం హీనపక్షం రూ.50 వేలైనా జేబులో పడనిదే అతడు ఇంటికెళ్లడట. అతడే తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ గా పనిచేస్తున్న ఆదిమూలం మోహన్. తెలుగు మీడియాలో ఇతడి అవినీతి భాగోతంపై లెక్కలేనన్ని కథనాలు వస్తుండగా, అతడి అవినీతి విశ్వరూపంపై తాజాగా నేషనల్ మీడియా కూడా ఆసక్తికర కథనాలను రాసింది. మూడు రోజుల క్రితం ఏపీ ఏసీబీ అధికారులు ఆదిమూలంపై మెరుపు దాడి చేశారు. ఏదో ఓ స్థాయి అవినీతి ఉంటుందిలే అని భావించిన ఏసీబీ అధికారులకు అతడి ఇంటిలో దొరికిన ఆస్తుల పత్రాలు చూసి కళ్లు బైర్లు కమ్మాయట. ఒక్క కాకినాడలోనే కాక పనిచేసిన ప్రతి జిల్లాలోనూ అతడు లెక్కలేనన్ని ఆస్తులు కూడబెట్టాడు. పొరుగు రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడుల్లోనూ అతడికి పెద్ద సంఖ్యలో ఆస్తులున్నాయని సోదాల్లో తేలింది. ఇక తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులో మోహన్ కు అత్యంత ఖరీదైన ఆస్తులున్నాయి. ఇప్పటిదాకా లభ్యమైన ఆస్తుల విలువ రూ.120 కోట్లుగా ఏసీబీ అధికారులు తేల్చారు. ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్ లో ఎంతలేదన్నా రూ.800 కోట్ల పైమాటేనని నేషనల్ మీడియా ఆసక్తికర కథనాలు రాసింది. ఇక ఆదిమూలం పేరిట ఉన్న పలు బ్యాంకు లాకర్లను తెరచిన ఏసీబీ అధికారులు... మరిన్ని లాకర్లు తెరవాల్సి ఉంది. ఈ లాకర్లలో ఏ మేర ఆస్తులు వెలుగుచూస్తాయో చూడాలి.

  • Loading...

More Telugu News