: ప్రత్యేక హోదాపై అడిగే నాథుడే కరువయ్యాడు: జగన్
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అడిగే నాథుడే కరువయ్యాడని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈరోజు హైదరాబాద్ లో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయన మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి ఎవరు కారణం? అని ప్రశ్నించారు. బీజేపీ, టీడీపీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ దగ్గరుండి మరీ రాష్ట్రాన్ని విడగొట్టారని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా అన్నది ఐదు కాదు పదేళ్లు కావాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. కానీ నేడు ప్రత్యేక హోదాపై ప్రశ్నించే వాడే కరువయ్యాడని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని ఆనాడు రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల్లో ప్రధాన అంశంగా ప్రచారం చేశారు. ఈరోజు మరో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా రాకపోవడంతో పరిశ్రమలు ఏపీకి రావడం లేదని జగన్ అన్నారు. హోదా కల్పిస్తే ట్యాక్స్ మినహాయింపుతో పెట్టుబడులు తరలివస్తాయన్నారు. హోదా అవసరం లేదని కేంద్రం చెబుతోందని, ప్రత్యేక హోదా వస్తే లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. రవాణాలో సగం రాయితీ ఇస్తారని, పారిశ్రామిక, విద్యుత్ రంగాల్లో ఎన్నో ప్రయోజనాలొస్తాయని తెలిపారు. చంద్రబాబు నాయుడు పెట్టుబడుల కోసం తిరిగే అవసరం ఉండదని జగన్ సూచించారు.