: బాబు గారూ... వెంకయ్య రాజ్యసభ సభ్యత్వానికి మద్దతివ్వొద్దు!: ఏపీ సీఎంకు సీపీఐ రామకృష్ణ సూచన


సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ కొద్దిసేపటి క్రితం టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు ఓ ఉచిత సలహా ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ప్రకటించిన బీజేపీ సర్కారు దమన నీతిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రామకృష్ణ కొద్దిసేపటి క్రితం కర్నూలులో మీడియాతో మాట్లాడారు. అసంబద్ధంగా జరిగిన రాష్ట్ర విభజన కారణంగా ఏపీ ఆర్థిక లోటులో చిక్కుకున్న విషయం కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుకు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీకి తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన వ్యాఖ్యానించారు. జూన్ 30తో రాజ్యసభ సభ్యత్వం ముగియనున్న బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు మరో దఫా రాజ్యసభ సభ్యత్వం కోసం ఏపీకి రానున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని ప్రస్తావించిన రామకృష్ణ... కేంద్రానికి తగిన బుద్ధి చెప్పాలంటే వెంకయ్య రాజ్యసభ సభ్యత్వానికి మద్దతివ్వకుండా ఉండాలని చంద్రబాబుకు సూచించారు. మరి, రామకృష్ణ సలహాపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి!

  • Loading...

More Telugu News