: ఒకే ఆటోపై మూడు జెండాలు!... పాలేరు ఉప బరిలో విచిత్రం!
తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ముగిసిన మునిసిపల్ ఎన్నికల సందర్భంగా పాలమూరు జిల్లా అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ దూకుడుకు చెక్ పెట్టేందుకు మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు ఏకమయ్యాయి. అయితే ఆశించిన ఫలితం సాధించలేకపోయాయి. తాజాగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. ఓకే ఆటోపై కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ జెండాలు దర్శనమిచ్చాయి. మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి హఠాన్మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ క్రమంలో పాత సంప్రదాయానికి తిలోదకాలిచ్చిన టీఆర్ఎస్ పోటీకే సై అంది. టీఆర్ఎస్ వైఖరిపై అసహనం వ్యక్తం చేసిన టీ టీడీపీ రాంరెడ్డి సతీమణి సుచరితారెడ్డికి మద్దతుగా నిలవాలని తీర్మానించింది. ఈ క్రమంలో ఆ పార్టీ తన అభ్యర్థిని బరిలోకి దింపలేదు. అదే సమయంలో వైసీపీ కూడా పోటీకి దూరంగా ఉంటూనే సుచరితారెడ్డికి సంఘీభావం తెలిపేందుకు సిద్ధపడింది. ఈ క్రమంలో నిన్న అటు టీఆర్ఎస్ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సుచరితారెడ్డిలు తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా రోడ్డుపైకి వచ్చిన ఓ ఆటోపై కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ జెండాలు కనిపించాయి. ఈ ఆటోను అక్కడి జనం ఆసక్తిగా చూశారు.