: అగస్టా ఎఫెక్ట్!... ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ త్యాగికి ఈడీ సమన్లు
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ తో పాటు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని సెల్ఫ్ డిఫెన్స్ లో పడేసిన అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంలో సంచలనాల మీద సంచలనాలు నమోదవుతున్నాయి. అక్రమ సంపాదనకు మరిగిన రాజకీయ నేతల చీకటి కోణాలు బయటపెట్టాల్సిన గురుతర బాధ్యత ఉన్న మీడియాకూ ఈ వ్యవహారంలో మకిలీ అంటిందన్న ఆరోపణలు గుప్పుమన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత వాయుసేన (ఇండియన్ ఎయిర్ ఫోర్స్) మాజీ చీఫ్ ఎస్పీ త్యాగీకి సమన్లు జారీ అయ్యాయి. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ మేరకు నిన్న ఆయనకు తాఖీదులు జారీ చేసింది. ఇలా వాయుసేన అధిపతిగా పనిచేసిన అధికారికి ఈడీ సమన్లు జారీ కావడం దేశ చరిత్రలో ఇదే ప్రథమమట. మనీల్యాండరింగ్ చట్టం కింద ఆయనకు సమన్లు జారీ అయ్యాయి. అగస్టా వ్యవహారంలో తమ ముందు విచారణకు హాజరు కావాలని సదరు నోటీసుల్లో ఈడీ... త్యాగికి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఏ సమయంలో త్యాగిని తాము విచారిస్తామన్న విషయాన్ని మాత్రం ఈడీ వెల్లడించలేదు. వాయుసేన చీఫ్ గా వ్యవహరించిన కారణంగానే ఈ మేరకు విచారణ సమయంపై ఈడీ కాస్తంత గోప్యతను పాటిస్తున్నట్లు సమాచారం.