: శంకర మఠం ఆడిటర్ పై దాడి కేసులో కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతికి ఊరట
శంకరమఠం ఆడిటర్ పై దాడి కేసులో కంచి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతికి ఊరట లభించింది. ఈ కేసులో జయేంద్ర సరస్వతితో పాటు మరో 8 మందిని నిర్దోషులుగా పేర్కొంటూ చెన్నై సెషన్స్ కోర్టు తీర్పు నిచ్చింది. కాగా, 2002 సెప్టెంబర్ 20న శంకర మఠం ఆడిటర్ రాధాకృష్ణన్, ఆయన భార్య జయశ్రీ, అసిస్టెంట్ కృష్ణన్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే కంచిలో శంకరమఠం విమర్శకుడు శంకర్ రామన్ హత్యకు గురయ్యాడు. దీంతో, ఈ రెండు సంఘటనలపై పోలీసులు కేసు నమోదు చేశారు. శంకర్ రామన్ హత్య కేసులో జయేంద్ర సరస్వతికి సంబంధాలున్నాయనే ఆరోపణల నేపథ్యంలో 2004 నవంబర్ 11న తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ లో జయేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాధాకృష్ణన్ పై దాడి కేసులోనూ జయేంద్ర సరస్వతిని నిందితుడిగా గుర్తించిన పోలీసులు నాడు అరెస్టు చేశారు. ఈ రెండు కేసుల్లో జయేంద్ర సరస్వతితో పాటు తొమ్మిది మందిని నిందితులుగా గుర్తించారు. అయితే, నిందితుల్లో ఒకరైన రవి సుబ్రహ్మణ్యం అప్రూవర్ గా మారిన విషయం తెలిసిందే.